‘అరే ఫలానా అమ్మాయిని చూడండి. క్లాస్‌లో టాపర్‌గా వచ్చింది.’ ఇది సాధారణంగా వినిపించే మాట. కానీ ఎప్పుడైనా ”మూడో తరగతి పరీక్షలో వాళ్ల అత్తగారు అల్లుడికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారట” అన్న మాటలు విన్నారా?

ఈ సంఘటన కేరళలో జరిగింది. 96 ఏళ్ల కార్త్యాయనీ అమ్మ ‘అక్షర లక్ష్యం సాక్షరతా కార్యక్రమం’ కింద నిర్వహించిన మూడో తరగతి పరీక్షలో 98 శాతం మార్కులతో పాసయ్యారు.

కేరళ అక్షరాస్యతా మిషన్ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ పరీక్షలో చదవడం, రాయడం, లెక్కలు చేయగలిగే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

ఈ పరీక్షలో పాసైన కార్త్యాయని తాను ఇక్కడితో ఆగిపోనని బీబీసీకి తెలిపారు.

”నేను నాలుగు, ఐదు.. అలా పది వరకు చదువుతాను. నాకు వందేళ్లు వచ్చేలోపు పదో తరగతి పూర్తి చేస్తాను. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అప్లై చేస్తాను” అని తెలిపారు.

ఈ పరీక్ష రాసింది కార్త్యాయనీ ఒక్కటే కాదు. ఆమె అల్లుడు కూడా పరీక్ష రాసి పాసయ్యారు కానీ ఆమెకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోయారు.

”పరీక్ష కోసం నేను, మా అల్లుడు ఇద్దరం కష్టపడి చదివాం. కానీ మా అల్లుడు ప్రశ్నలన్నిటీ సమాధానాలు రాయలేకపోయారు. నేను మాత్రం అన్నింటికీ సరైన సమాధానాలు రాశాను” అని తెలిపారు.

ఈ పరీక్ష ఎంత మంది రాశారు?

కేరళ నుంచి మొత్తం 43 వేల మంది ఈ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన వారిలో కార్త్యాయనే అత్యంత వృద్ధురాలు.

ఆమెకు ఈ పరీక్షలో వచ్చిన మార్కులు:

  • గణితం: 28/30
  • రాత పరీక్ష: 40/40
  • చదవడం: 30/30

ఈ పరీక్ష పాసైన కార్త్యాయనికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి సర్టిఫికేట్ కూడా లభిస్తుంది.

చిన్నతనంలో పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా తాను చదువుకోలేకపోయినట్లు కార్త్యాయని తెలిపారు.

ఆమె అళప్పుజ జిల్లాలోని చేప్పాడు గ్రామానికి చెందిన వారు. మూడవ తరగతి పాసైన కార్త్యాయని తర్వాత లక్ష్యం కంప్యూటర్ నేర్చుకోవడం.

”పిల్లలు చదువుకుంటుంటే చూసి నాకూ ఉత్సాహం వచ్చింది. నేను చిన్నప్పుడే చదువుకుని ఉంటే ఇవాళ ప్రభుత్వోద్యోగిని అయి ఉండేదాన్ని” అన్నారు.

కార్త్యాయని చదువుకోవడానికి ప్రేరణ కలిగించిన వారిలో ఆమె కూతురు అమ్మినీ అమ్మ కూడా ఉన్నారు. అమ్మినీ 62 ఏళ్ల వయసులో పదో తరగతి పూర్తి చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments