డిసెంబర్‌ నుంచి రూ.2,016 పింఛను : కేటీఆర్‌

534

తెరాస మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 11వ తేదీ నుంచి రూ.2016 పింఛను ఇస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛను అందుకునే వయస్సును 60 నుంచి 55కు తగ్గిస్తామని తెలిపారు. వికలాంగులకు రూ.3016 పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు. నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతిని దాదాపు 10లక్షల మందికి అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడైనా 24గంటలు కరెంటు ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన ఆరుగంటలను కూడా విడతల వారీగా ఇచ్చిందన్నారు. నాలుగెకరాలు ఉంటే కేవలం రెండు ఎకరాలకు మాత్రమే నీరు వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌ హయాంలో నెలకొందన్నారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక రూ.17వేల కోట్ల రుణమాఫీ, 24గంటల కరెంట్‌ ఇచ్చారన్నారు. రైతుబంధు రూపంలో ఎకరానికి రూ.8,000 ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకూ రుణమాఫీతోపాటు రైతుబంధు మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు యాదగిరిగుట్ట అభివృద్ధికి కృషి చేశారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక యాదగిరిగుట్టను తిరుపతికి దీటుగా అభివృద్ధి చేశారని తెలిపారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించేలా కాంగ్రెస్‌ నాయకులు 200 కేసులను వేశారన్నారు. చనిపోయిన వారి పేర్లతో కూడా కేసులు వేశారని విమర్శించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వారి గుట్టును అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారన్నారు.

కాంగ్రెస్‌-చంద్రబాబులు ఇద్దరూ ఏకమయ్యారని అన్నారు. ఆలేరులో అభ్యర్థిని రాహుల్‌ కాకుండా చంద్రబాబునాయుడు ఎంపిక చేస్తారని తెలిపారు. రాహుల్‌ సీట్లు ఇవ్వొచ్చు.. చంద్రబాబు నోట్లు ఇవ్వొచ్చు కానీ ఓట్లేసిది ప్రజలే అన్నారు. తెరాసను వారే గెలిపిస్తారని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌, హైదరాబాద్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ను రైలును తీసుకొస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆలేరు నియోజకవర్గంలో 1.40లక్షల ఎకరాలకు నీరు అందజేస్తామని ప్రకటించారు. దేశానికి 70ఏళ్లలో కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని మొండిచెయ్యి గుర్తు ఇచ్చారు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే భాజపాకు పువ్వు గుర్తు ఇచ్చారు.. పుల్లలు పెట్టే వారికి అగ్గిపెట్టె గుర్తు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప్రగతి రథ చక్రం ఆగకూడదంటే కారు గుర్తుకు ఓటువేయాలని కేటీఆర్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here