విశాఖపట్నం అద్భుతంగా ఉందని, ఇక్కడకు రావడం ఎంతో ఇష్టమని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కోహ్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అయిదు వన్డేల సిరీస్‌లలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం విశాఖ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు జట్లు విశాఖపట్నంకు చేరుకున్నాయి. మంగళవారం తాను బస చేసిన హోటల్ నుంచి కోహ్లి సముద్రం కనబడేలా ఫోటో తీసుకుని దాన్ని ట్వీట్ చేశాడు. విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడు.
విశాఖపట్నం దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ట్వీట్ చేశారు.అలాగే, బుధవారం విశాఖపట్నం వన్డే సందర్భంగా కోహ్లి సేనకు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై నెటిజన్లు చంద్రబాబుకు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.