వచ్చే ఎన్నికల్లో వైసిపి-జనసేన పార్టీలు కలిసే ఎన్నికలను ఎదుర్కొంటాయని వైసిపి తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ చేసిన ప్రకటనతో వైసిపి నేతలు, శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రెండు పార్టీల మధ్య పొత్తుల విషయంలో మాజీ ఎంపి గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా చెప్పారు. అయితే పొత్తుల విషయంలో రెండు పార్టీల అధినేతల మాటగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. అలాగని వరప్రసాద్ ప్రకటనను ఇటు జగన కానీ అటు పవన్ కానీ ఖండించలేదు. కాకపోతే పొత్తుల విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. ఒకసారి పొత్తులుండవని చెబుతూనే ఇంకోసారి ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయాన్ని తేల్చుతామంటూ ఇద్దరు అధ్యక్షులు చెబుతున్నారు. దాంతో పొత్తులపై సర్వత్రా అయోమయం నెలకొన్న మాట వాస్తవం.

చంద్రబాబు జేబులోని మనిషేనా ?

నిజానికి వైసిపి-జనసేనలు పొత్తుంటాయని ఎవరూ అనుకోవటం లేదు. అయితే, రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని మాత్రం వరప్రసాద్ లాంటి వైసిపి నేతలు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాకపోతే పవన్ వైఖరిపైనే అందరిలోనూ అనుమానాలున్నాయి. చంద్రబాబునాయుడు, లోకేష్ పై పవన్ ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి ఇద్దరిపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడతారు. కొద్ది రోజుల తర్వాత చంద్రబాబుతో ఏకాంతంగా పవన్ భేటీ అవుతారు. దాంతో పవన్ ఇంకా చంద్రబాబు జేబులోని మనిషే అన్నట్లుగా అనుమానిస్తున్నారు.

జగన్-పవన్ పొత్తు తప్పదా ?

తిరుపతిలో తాజాగా మాజీ ఎంపి మాట్లాడుతూ, పవన్ విజన్ ఉన్న నాయకుడంటూ కితాబిచ్చారు. వైసిపి మాజీ ఎంపిగా ఉంటూ పవన్ ను ఎందుకు పొగుడుతున్నారన్న విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే, పొత్తుల విషయంతో పాటు పవన్ వ్యక్తిత్వంపై చేసిన కామెంట్లను మాజీ ఎంపి సమర్ధించుకుంటున్నారు. తాను మొదటిసారి ఎంపిగా పోటీ చేసింది ప్రజారాజ్యంపార్టీ తరపునే అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి పవన్ గురించి తనకు బాగా అవగాహన ఉందంటున్నారు. జగన్, పవన్ గురించి తెలిసిన వ్యక్తి కాబట్టే త్వరలో వైసిపి, జనసేనలు పొత్తులు పెట్టుకుంటాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here