ఆహార పదార్ధాల పార్సిల్స్‌ డెలివరీ చేసే బాయ్‌.. కస్టమర్లకు అందించాల్సిన ఆహారాన్ని తానే సగం తినేసి తర్వాత దాన్ని మళ్లీ మామూలుగా ప్యాక్‌ చేసి డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్లిన ఘటన చైనాలో జరిగింది. గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని సిహుయి నగరంలో ఓ డెలివరీ బాయ్‌ చేసిన నిర్వాకం సీసీటీవీలో రికార్డు కాగా.. ఆ ఫుటేజీ వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్‌ లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు ఈ పని చేశాడు. ప్లాస్టిక్‌ బాక్సును తెరిచిన డెలివరీ బాయ్‌ అందులోనే నోరు పెట్టి మరీ సగం ఆహారాన్ని తినేశాడు. తర్వాత చక్కగా మళ్లీ మూత పెట్టేసి కవర్‌లో ప్యాక్‌ చేసేశాడు. ఇంకో బాక్సులో ఉన్న సూప్‌ కూడా అలాగే తెరిచి కొంచెం తాగి మళ్లీ మూత పెట్టి కవర్‌లో పెట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు ఎంచక్కా పార్సిల్‌ కవర్‌ తీసుకుని డెలివరీ ఇచ్చేందుకు లిఫ్ట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. డెలివరీ బాయ్‌ను చైనాలోని ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ మైచువన్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. అయితే అతడి పేరును వెల్లడించలేదు. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో సదరు కంపెనీ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.

సీసీటీవీ ఫుటేజీని షాంఘియిస్ట్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయగా దాన్ని ఇప్పటికి దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది షేర్లు, వందలాది కామెంట్లు వస్తున్నాయి. ఇందుకే నేను ఆహారం ఆర్డర్‌ చెయ్యట్లేదని ఓ వ్యక్తి కామెంట్‌ చేశారు. గతంలో కూడా డెలివరీ బాయ్స్‌ ఇలాంటి పనులు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments