హీరోయిన్‌ అలిగిందని ఆమె అలక తీర్చడానికి హీరోగారు రకరకాల ప్రయత్నాలు చేయడం మనం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. ‘సారీ’ పేరుతో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పాటలు కూడా వచ్చాయి. ఇలా కాకుండా ప్రియురాలు అలక తీర్చడానికి వినూత్నంగా ప్రయత్నించాడో అపర ప్రేమికుడు. ఆమె రోజూ వెళ్లే దారిలో, నగరంలో అక్కడక్కడా ‘శివ్‌దే ఐ యామ్‌ సారీ’ అంటూ బ్యానర్లను కట్టించారు. ఇతను చూపిన అత్యుత్సాహం పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. పుణెలోని పంప్రి చించ్వాడ్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అయిన నీలేశ్‌ ఖేడేకర్‌ అనే వ్యక్తి చేసిన ఘన కార్యమే ఇది. తన ప్రేయసితో స్వల్పంగా గొడవ కావడంతో ఆమె అలకబూనింది. ఆమె కోపాన్ని తగ్గించడానికి వినూత్నంగా సారీ చెప్పాలనుకున్నాడు. ఆమె వెళ్లే దారిలో, ఇతర రద్దీప్రాంతాల్లో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్‌లు కట్టించాడు. గత శుక్రవారం నగరంలో అక్కడక్కడా బ్యానర్లు, హోర్డింగ్‌లను చూసి పోలీసులు అవాక్కయ్యారు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బ్యానర్లు కట్టించిన వ్యక్తి గురించి ఆరా తీయగా అతను నిలేశ్‌ అని తేలింది. అనుమతుల్లేకుండా అక్రమంగా ఇలా బ్యానర్లు కట్టించినందుకు గానూ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here