తెలంగాణ వివాదాస్పద నాయకుడిగా ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అందజేశారు. ఫైర్ బ్రాండ్ హిందుత్వవాదిగా ముద్ర పడిన రాజా సింగ్ కొన్ని రోజులుగా ‘గో రక్షణ’ పేరుతో ఓ ఉద్యమం నడుపుతున్న విషయం తెలిసిందే. ‘గో వధ’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన, గో సంరక్షణ కోసం దేనికైనా సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు.

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా ఈయన పార్టీపట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా అధిష్ఠానాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఆయన్ను బుజ్జగించేందుకు ఢిల్లీ స్థాయి కమలనాథులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే రాజీనామా అంగీకారం అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘గోరక్షణ’కోసం దేనికైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. అసలు తాను తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీకి లింకు పెట్టాలని చూస్తున్నారని.. తన ఉద్యమానికి పార్టీకి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

పార్టీకి తన వల్ల నష్టం కలగకూడదనే రాజీనామా చేసినట్లుగా స్పష్టం చేశారు. తెలంగాణాలో యధేచ్చగా గోవులను కబేళాలకు తరలిస్తున్నారని, గోవధను ఈ ప్రభుత్వం అరికట్టలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికైనా గోవధను తెలంగాణా సర్కార్ అరికట్టాలని ఆయన కోరారు. సోమవారం నుంచి గో సంరక్షణ కోసం స్వయంగా తానే రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించిన రాజాసింగ్, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ గో రవాణాను అరికట్టకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గో మాత కోసం ప్రాణం తీయడానికైనా, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here