మూడేళ్ల బాబు ఏడుస్తున్నాడని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం నుంచి ఓ భారతీయ కుటుంబాన్ని బలవంతంగా దించేసిన ఘటన బ్రిటన్‌లోని లండన్‌లో చోటుచేసుకుంది. జులై 23న లండన్‌ నుంచి బెర్లిన్‌ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని, జాతి వివక్ష చూపారని చిన్నారి తండ్రి భారత విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు లేఖ రాశారు. ‘విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా సిబ్బందిలోని ఓ వ్యక్తి వచ్చి మా బాబును సీట్లో కూర్చో అని గట్టిగా అరిచాడు. దీంతో బాబు భయపడి ఏడ్చాడు. తల్లి సముదాయించేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు ఊరుకునే సమయానికి విమాన సిబ్బంది ఒకరు వచ్చి మళ్లీ గట్టిగా తిట్టాడు. యూ బ్లడీ..

నోరు మూయకపోతే కిటికీలో నుంచి బయటకు విసిరేస్తా అని అరిచాడు. దీంతో బాబు బాగా భయపడిపోయి ఇంకా ఎక్కువగా ఏడవసాగాడు. సిబ్బంది ప్రవర్తనకు మాకూ భయమేసింది. మా వెనుక కూర్చున్న మరో భారత కుటుంబం నా కొడుకును సముదాయించే ప్రయత్నం చేసింది.

బిస్కట్లు కావాలా అడుగుతూ ఊరుకోబెట్టాలని చూశారు. కానీ విమాన సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని బలవంతంగా విమానం నుంచి దించేశారు. విమానాన్ని తిరిగి టర్మినల్‌కు తీసుకెళ్లి మా వద్ద నుంచి బోర్డింగ్‌ పాస్‌ తీసుకొని కిందకు దిగమని చెప్పారు. మాతో పాటు మాకు సాయం చేయాలని చూసిన మరో భారత కుటుంబాన్ని కూడా దించేశారు’ అని చిన్నారి తండ్రి లేఖలో రాశారు.

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది జాతి వివక్ష చూపించారని, దారుణంగా అవమానించారని ఆయన వెల్లడించారు. భారతీయులనే వివక్షతో ‘బ్లడీ’ అనే పదం వాడారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్‌ ప్రభును కోరారు. ఈ ఘటనపై బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ స్పందించింది.

ఇలాంటి ఆరోపణలను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని, జాతి వివక్షను సహించబోమని విమానయాన సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, సదరు ప్రయాణికుడిని సంప్రదిస్తున్నామని తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments