తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(94) కన్నుమూశారు. గత నెల 28న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్లపై ఆయన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చిన డాక్టర్స్ నిన్న సాయంత్రం ఇంకా మా వాళ్ల కాదని చేతులెత్తేశారు. నిన్న సాయంత్రమే కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకొని చివరి చూపును చూడడం జరిగింది.

వయసు మీరడం వల్ల ఆయన ముఖ్యావయవాలు చికిత్సకు స్పందించడం లేదని, దీంతో చికిత్స చేయడం ఓ సవాలుగా మారిందని కావేరీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ హెల్త్ బులెటిన్ ప్రకటించారు. ఆ తరువాత కాసేపటికే ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు.

ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణవార్త తెలిసిన తర్వాత తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్‌టీసీ బస్సుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడులో ఇవాళ, రేపు… సినిమా హాళ్లను బంద్ చేయనున్నారు. అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here