బ్యాడ్మింటన్‌లో అత్యున్నత టోర్నీలో ఒకటైన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌లో సైనా, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ తర్వాతి రౌండ్లలోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో బై లభించిన సైనా రెండో రౌండ్లో ఈ రోజు అలియె దెమిర్‌బగ్‌ (టర్కీ)తో తలపడింది. తొలి గేమ్‌లో మాత్రమే అలియో.. సైనాకు పోటీ ఇవ్వగలిగింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి చేతులెత్తేయంతో సులువుగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సైనా 21-17, 21-8 తేడాతో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్లో నాట్‌ నుయెన్‌(ఐర్లాండ్‌)తో తలపడ్డాడు. ఇద్దరి మధ్య హోరా హోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్‌ 21-15, 21-16తో నుయెన్‌ను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ రంకి రెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ 10-21, 21-17, 21-18 తేడాతో జర్మనీ జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన-రామ్ పూర్వీష, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ-సిక్కి రెడ్డి, రోహన్‌ కపూర్‌-కుహూ గార్గ్‌, పురుషుల డబుల్స్‌లో కోన తరుణ్‌-సౌరభ్‌ శర్మ జోడీ, అర్జున్‌-రామచంద్రన్‌ జోడీలు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments