శ్రీరాముడిపై తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున‍్నారన్న ఆరోపణలతో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఇదివరకే ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నగర బహిష్కరణ విధించిన విషయం విధితమే. అయితే తన సొంతూరుకు వెళ్లాలనుకున్న కత్తి మహేష్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అతడిని స్వగ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం.

చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని తన స్వగ్రామం యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్‌ తెలిపారు. ఈ మేరకు పీలేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయనను పోలీసులు వద్దని వారించారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్‌ యలమందకు వెళితే అక్కడ హిందూ ధార్మిక సంఘాలు దాడి చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. అయినా కత్తి మహేష్‌ వెనక్కి తగ్గకపోవడంతో.. బలవంతంగా జీపు ఎక్కించారు పీలేరు పోలీసులు. అక్కడినుంచి ఆయనను బెంగళూరుకు తరలించారు.

కాగా, కత్తి మహేష్‌పై వేటు వేసిన తర్వాత స్వామి పరిపూర్ణానందను సైతం పోలీసులు హైదరాబాద్‌ నగరం నుంచి ఆరు నెలలపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, కత్తి మహేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిషేధించాలంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేటు పడ్డ తర్వాత శ్రీరాముడిపై కత్తి మహేష్‌ పాడిన శ్లోకం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments