బురిడీ బాబాల చేతుల్లో అమాయకులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. నగలను రెట్టింపు చేస్తామని చెబితే నమ్మి చేతికిచ్చి తర్వాత తీరిగ్గా బాధపడుతున్నారు. తాజాగా ఇటువంటిదే మరో ఘటన జరిగింది. చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలో బ్రహ్మానందం పాత్రను తలపించేలా ఈ ఘటన జరగడం విశేషం. ఇంకా చెప్పాలంటే సేమ్ టు సేమ్ అన్నమాట. ప్రస్తుతం ఈ బురిడీ బాబా పోలీసుల అదుపులో ఉన్నాడు.

సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. శివోహం రామ శివానుజం అలియాస్‌ రామ శివ చైతన్యం స్వామీజీ స్వస్థలం కేరళలోని కలాడి. తత్వవేదం పీఠాధిపతిగా చెప్పుకునే ఆయన కొన్నాళ్లు కలాడి తిరుచూరులో ఉన్న శివోహం జ్ఞానగురుపీఠంలో ఉన్నాడు. 1999లో అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న స్వామీజీ బోయిన్‌పల్లిలో మకాం వేశాడు. వివిధ దేవాలయాల్లో నిర్వహించిన యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నాడు. 2009లో బోయిన్‌పల్లికే చెందిన తేజశ్వినిని వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు సంతానం.

ఆ తర్వాత కొన్ని రోజులకు యూసఫ్‌గూడ కృష్ణకాంత్‌ పార్కు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మకాంను అక్కడికి మార్చాడు. తత్వపీఠం పేరుతో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో పూజలు చేస్తే లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. ఒక్కో పూజకు రూ.2లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూలు చేసేవాడు. పూజల అనంతరం ఇంట్లోని నగలను ఓ చెంబులో వేసి పూజ గదిలో పెట్టమనేవాడు. దాని మూతను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని, 60 రోజుల తర్వాత తానే వచ్చి తీస్తానని చెప్పేవాడు. అప్పటికి బంగారం రెట్టింపు అవుతుందని నమ్మబలికేవాడు.

ఆ తర్వాత అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థించాలని చెబుతాడు. అదే సమయంలో పక్కనుండే భార్య సహకారంతో అసలు చెంబును తమ సంచిలో వేసుకుని, తమతో తెచ్చిన అదే మాదిరి చెంబును అక్కడ పెడతాడు. ఇలా ఇప్పటి వరకు 11 మందిని మోసం చేసి కోట్లలో కొల్లగొట్టాడు. మొత్తంగా రెండు కిలోల బంగారం, కోటి రూపాయలకు పైగా డబ్బును దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగబాబాతోపాటు అతడి భార్య తేజశ్వినిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు రెండు కిలోల నగలు, కారును స్వాధీనం చేసుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments