గూగుల్ సంస్థకు అనుబంధంగా ఉన్న యూట్యూబ్‌ను ప్రతిరోజూ లక్షలాది మంది వీక్షిస్తుంటారు. ఎన్నో కొత్త కొత్త వీడియోలను ఔత్సాహికులు యూట్యూబ్‌కు అప్లోడ్ చేస్తుంటారు. మదిలో మెదిలే ఆలోచన దేనికి సంబంధించినది అయినప్పటికీ యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అందుకు సంబంధించిన వీడియోలు క్షణాలలో ప్రత్యక్షమవుతాయి. ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయింది. దేశరాజధాని ఢిల్లీలోని ఒక డాక్టరుకు సంబంధించిన ఐవీఎఫ్ ప్రాక్టీసెస్ (కృత్రిమ గర్భధారణకు సంబంధించిన అంశం) విషయంపై యూట్యూబ్‌లో ఒక వీడియోను ఉంచారు. 2015లో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్నది.
కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని యూట్యూబ్ నుంచి సంబంధిత వీడియోను తొలగించాలని ఆదేశించారు. అయితే సాంకేతిక కారణాలను చూపిస్తూ యూట్యూబ్ ఇందుకు మరింత గడువు కోరుతూ వచ్చింది. అనంతరం వీడియోను తొలగించడం సాధ్యం కాదని, దానిని ఎవరూ చూడకుండా డిజేబుల్ చేశామని యూట్యూబ్ సంస్థ కోర్టుకు విన్నవించింది. అయితే వీడియోను శాశ్వతంగా తొలగించకపోవడం పట్ల కోర్టు అసంతృప్తిని వ్యక్తంచేసింది. దీనితో ఆ సంస్థ వీడియోను తొలగించే విషయంలో సాంకేతిక కారణాల కారణంగా కోర్టు నిర్ణయాన్ని అమలు చేయలేకపోయామని పేర్కొన్నది. తాజాగా కోర్టు తన తీర్పులో యూట్యూబ్‌కు రూ.9లక్షల 50వేలు ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.1లక్ష చెల్లించాలని ఆదేశించింది.