హైదరాబాద్‌లోని అంబర్ పేట నియోజకవర్గంలో బోనాల నిర్వహణ కోసం 50 లక్షల రూపాయల జీహెచ్ఎంసీ నిధులను ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. అంబర్ పేట నియోజకవర్గంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలతో కలసి తలసాని.. వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వివరించారు. దర్శనానికి వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా ఆర్అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో భారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

భక్తులకు పంపిణీ చేసేందుకు 50 వేల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్ అధికారులను తలసాని ఆదేశించారు. రూ.5.80 లక్షలతో బోనాల కోసం ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోనాల సందర్భంగా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మహంకాళి ఆలయం వద్ద ఒక వేదికను ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించదలిస్తే ఆలయ కమిటీ సభ్యులు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments