అమ్మాయి పక్క సీటు కోసం ఇద్దరు విద్యార్థులు రక్తమొచ్చేలా కొట్టుకున్నారు. జూనియర్ పై సీనియర్ స్టూడెంట్ కత్తితో కూడా దాడి చేశాడు. ఈ ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే… సాయంత్రం స్కూలు అయిపోయిన తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లడానికి స్కూలు బస్సు ఎక్కారు. 11వ తరగతి చదువుతున్న అమ్మాయి పక్కన సీనియర్ విద్యార్థి కూర్చోవాలనుకున్నాడు. అయితే, అప్పటికే ఆమె పక్కన 10వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి కూర్చున్నాడు. ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని… లేచి వేరే సీటులో కూర్చోవాలని జూనియర్ ను సీనియర్ బెదిరించాడు. జూనియర్ నిరాకరించడంతో… ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.
ఇద్దరి మధ్య గొడవను ఆపడానికి బస్సు డ్రైవర్ తో సహా తోటి విద్యార్థులు చెప్పినా, వారు తగ్గలేదు. పరస్పరం చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో బస్సును దారి మధ్యలో ఆపిన సీనియర్… పక్కనే ఉన్న స్టాల్ లో కత్తిని తీసుకుని జూనియర్ పై దాడి చేశాడు. మెడ, భుజంపై గాట్లు పెట్టాడు. డ్రైవర్, హెల్పర్, ఇతర విద్యార్థులు అడ్డుకుని జూనియర్ ను కాపాడారు. గాయపడ్డ జూనియర్ ను ఆసుప్రతికి తరలించారు. మరోవైపు, దాడికి పాల్పడ్డ సీనియర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.