టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పై ఓ బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే, టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ లేదా ప్రియాంక చోప్రా నటిస్తారనే వదంతులు హల్ చల్ చేశాయి. ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ ను ఎవరు పోషిస్తున్నారనే విషయాన్ని చిత్రయూనిట్ ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో తన పాత్రను ఎవరు పోషిస్తుంటే బాగుంటుందనే విషయాన్ని మిథాలీరాజ్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ ఆధారంగా తీయబోతున్న ఈ బయోపిక్ లో తన పాత్రను ప్రియాంక చోప్రా చేస్తే బాగుంటుందని, ఆమె అయితే చక్కగా నటించగలదని అభిప్రాయపడింది. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయని చెప్పింది. సినీ రంగంపై తనకు అంతగా అవగాహన లేదని చెప్పిన మిథాలీ, నటుల ఎంపిక నిర్ణయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఇష్టానికే వదిలేస్తున్నానని చెప్పడం గమనార్హం.