నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఊమెన్ చాందీ పర్యటన ప్రారంభం అయిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లా పెనమలూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. తొలుత పెనమలూరులో కిలారు అనిల్ ఎస్టేట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఊమెన్ చాందీ మాట్లాడుతూ.. తాను రెండవసారి విజయవాడ రావటం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా కార్యకర్తలకి రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మంచి నాయకత్వాన్ని ఇవ్వగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తులు అవసరం లేదని, రాష్ట్రంలో ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.కార్యకర్తలే కాంగ్రెసుకు బలమని, పార్టీ బలోపేతం కోసం వారంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తెలిపారు. జీఎస్టీతో లక్షలమంది నష్టపోయారని తెలిపారు. అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ విఫలం చెందారని, ఇప్పుడు ప్రజల పక్షాన మనం పోరాడితే తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని అన్నారు.