వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌, ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవీఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులు… బీజేపీ పంజరంలో చిక్కుకున్న రామచిలుకలని, వారంతా.. ఆ పార్టీ పలుకులే పలుకుతున్నారని ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. అడ్డదారిలో ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీలను పవన్ కల్యాణ్ గేలి చేయడం రాజ్యంగం విరుద్ధమని, ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని ఆయన హితవు పలికారు.అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంతో పాటు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి విస్మరించిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. రేయింబవళ్లు రాష్ట్రం కోసం కృషి చేస్తోన్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌లను జగన్, పవన్, ఐవీఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులు విమర్శించడం సరికాదన్నారు.

మేధావి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటున్న ఐవీఆర్ కృష్ణారావు రాష్ట్రమంతటా తిరుగుతూ, రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాన్ని అవమానిస్తూ మాట్లాడడం తగదన్నారు. సీఎస్ గా ఉన్నప్పుడు ఇవేవీ తప్పులుగా కనిపించలేదా? అని ఆయనను ప్రశ్నించారు. జగన్, అమిత్ షాలను రమణ దీక్షితులు కలియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి, పార్లమెంట్ చట్టాల్లో భాగంగా శాసన మండలి, రాజ్యసభలు ఏర్పాటయ్యాయన్నారు. ఆ రెండింటి నుంచి ఎందరో ప్రధాన మంత్రులుగా, ముఖ్య మంత్రులుగా ఎంపికయ్యారన్నారు. అటువంటి పెద్దల సభ నుంచి ఎంపికైన వారిని పవన్ కల్యాణ్ తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. వాళ్లన్నయ్య చిరంజీవి కూడా పార్లమెంట్ లో ఎగువ సభ అయిన రాజ్యసభ నుంచే ఎన్నికై, కేంద్రమంత్రి పదవి చేపట్టిన విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు.

రాజ్యాంగంలో ఎమ్మెల్సీలు భాగమని, తమను అగౌరవపరుస్తూ మాట్లాడితే శాసనమండలి ప్రివిలైజేషన్ మోషన్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పవన్ ను ఆయన హెచ్చరించారు. విశాఖకు రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీపై మాట తప్పిన కేంద్రాన్ని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని శాసనమండలి డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు.

లోకేష్ ను పవన్ కల్యాణ్ అభినందించాల్సిందిపోయి, విమర్శించడం సరికాదన్నారు. ప్రత్యక్ష ఎన్నకిల్లో లోకేశ్‌ పాల్గొనడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి పోరాడాలని, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారని జగన్, పవన్ లకు ఆయన సూచించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments