నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్
తారాగణం: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: అండ్రూ.ఐ
మాటలు: డార్లింగ్ స్వామి
కూర్పు: ఎస్.ఆర్.శేఖర్
కళ: సాహి సురేశ్
సహ నిర్మాత: వల్లభ
నిర్మాత: కె.ఎస్.రామారావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్
కథ :
తేజ్ (సాయిధరమ్‌తేజ్) పద్ధతిగల కుటుంబానికి చెందిన అబ్బాయి. ఓ సమస్య కారణంగా అతన్ని, అతని పెదనాన్న(జయప్రకాష్) కుటుంబం నుంచి వెలివేస్తాడు. దాంతో కాలేజీ అయిపోయాక సప్లీలు రాసుకుంటూ హైదరాబాద్‌లోని బాబాయ్ (పృథ్వి) ఇంట్లో ఉంటాడు. అలా కాలేజీలో కొంత మంది స్నేహితులతో కలిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాంటి సమయంలోనే అతనికి నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. అనుకోకుండా జరిగిన అగ్రిమెంట్ కారణంగా 15 రోజులు ఆమెకు అతను బాయ్ ఫ్రెండ్‌గా నటించడానికి సిద్ధమవుతాడు. ఆ గడువు పూర్తయ్యేలోపు ఆమే అతనికి గర్ల్ ఫ్రెండ్‌గా నటించడానికి సిద్ధపడుతుంది. ఇలా ఒకరికి ఒకరు చేరువయ్యే క్రమంలో నందినికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ కి కారణం ఎవరు? నందినిని ఫాలో చేస్తున్న వారు ఎవరు? ఆమెకు ఎవరి వల్ల ప్రమాదం. లండన్ నుంచి నందిని అసలు ఇండియాకు ఎందుకు వచ్చింది? ఆమె తండ్రి ఆమెకు మంచి చేశాడా? చెడు చేశాడా? ఇంతకీ తేజ్, నందిని ఒకరినొకరు ఇష్టపడ్డారా? ఆ విషయం పరస్పరం చెప్పుకున్నారా? లేదా? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు
– సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్, ఇతర నటీనటులు
– లొకేషన్స్, కాస్ట్యూమ్స్
– కెమెరా, అందమైన చందమామ పాట
మైనస్ పాయింట్లు
– రొటీన్ కథ
– సంగీతం
– స్క్రీన్‌ప్లే
విశ్లేషణ
తేజ్.. ఐ లవ్యూ అనగానే మంచి లవ్ స్టోరీ అనే ఫీలింగ్ అనిపించింది. దానికి తోడు కరుణాకరన్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారనగానే తప్పకుండా ఎంతో కొంత తేజ్‌కి క్రేజ్ వచ్చింది. అయితే హీరో, హీరోయిన్ల మధ్య ఏదో డీల్ కుదరడం, అది నచ్చకపోయినా, లోపల ఎక్కడో నచ్చుతున్నా.. పైకి నచ్చనట్టు కనిపిస్తూ మరొకరు ఆ డీల్ కోసం కృషి చేయడం, తీరా ప్రేమను చెప్పుకోవాల్సిన సమయంలో దానికి ఆటంకం కలగడం, చివరికి హీరో, హీరోయిన్లు ఇద్దరూ తమ ప్రేమతో ఒకటి కావడం అనేది కొత్త కాదు. చెల్లెలిని నచ్చినవాడికిచ్చి పెళ్లి చేసి, అది ఇంట్లో వాళ్లకు నచ్చకపోవడంతో ఇంటికి దూరంగా ఉండటం కూడా కొత్త కాదు. ప్రేయసి మీద గుండెల నిండా ప్రేమ ఉన్నా, అది ఆమెకు ఎక్కడో నచ్చదో అనే ఏకైక కారణంగా, ఆమెను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేకుండా ప్రవర్తించే హీరోలు మనకు కొత్తకాదు. పోనీ అది పాత విషయమే అయినా, దర్శకుడు ఎక్కడా కొత్తగా చెప్పే ప్రయత్నమూ చేయలేదు. క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే అనిపించింది. గోపీసుందర్ స్వరపరిచిన పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు. స్టార్టింగ్ సాంగ్‌లో `స్నేహితుడు`లోని `మన ఫ్రెండల్లే..` పాటలోని ట్యూను వినిపిస్తుంది. చిరంజీవి, నాగబాబుని తేజ్ అక్కడక్కడా ఇమిటేట్ చేయడం అభిమానులకు నచ్చుతుంది. అనుపమ తన పాత్రలో బాగానే నటించింది. తేజ్ ఫ్యామిలీ మెంబర్స్ పాత్రల్లో నటించినవారందరూ బాగా చేశారు. వైవా హర్షకు కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ పడింది. అనీష్ కురువిల్ల షరా మామూలు పాత్రలో కనిపించారు. కథలో ట్విస్టులు లేకపోవడం, ఎంపిక చేసుకున్న సమస్యను కూడా లోతుగా చూపించకపోవడం వంటివాటివల్ల సినిమా అనాసక్తిగా, నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది.
తాజావార్తలు రేటింగ్ : 2.5/5