విశ్వనట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు (ఎస్వీ రంగారావు) శత జయంతి సందర్భంగా 12.5 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని ఏలూరు కలపర్రు టోల్గేట్ వై.జంక్షన్లో ముఖ్యమంత్రి జూలై 3వ తేదీ ఉదయం 11 గంటలకు ఆవిష్కరిస్తారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏలూరుకు చెందిన ఎస్వీ రంగారావు 5 భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అందరి మన్ననలు పొందారని, అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏలూరులో ప్రతిష్టించాలని కోరిన వెంటనే సీఎం అంగీకరించారని చెప్పారు.
జూలై 3న ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ అనంతరం ఏలూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. సమావేశంలో ఎస్వీ రంగారావు మనుమడు ఎస్వీ రంగారావు, ఏఏంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేటర్లు దాకారపు రాజేశ్వరరావు, జిజ్జువరపు ప్రతాప్‌కుమార్, చోడే వెంకటరత్నం, మారం అను పాల్గొన్నారు.