పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న లేఖ రాశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.

‘జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ మీరు నిన్న గడ్కరీ గారికి రాసిన లేఖను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించవలసి ఉంది. అయితే, మీకు-మోదీ గారికి ఏ ఒప్పందం జరిగిందో తెలియదు కానీ పోలవరాన్ని కేంద్రానికి బదులుగా రాష్ట్రమే నిర్మిస్తుందని కేంద్రంతో చెప్పించి – నిర్మాణం మీ చేతుల్లోకి తీసుకొన్నారు.

ఇలా నిధుల విషయంలో క్లారిటీ లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేతుల్లోకి తీసుకొంటే.. ఈ ప్రాజెక్ట్ ఖర్చు రాష్ట్రంపై పడుతుందని నేను గతంలో అనేక లేఖల ద్వారా మిమ్మల్ని హెచ్చరించి ఉన్నాను.  అదే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చును 2013-14 రేట్ల అంచనాల ప్రకారమే ఇస్తామని, కాస్ట్ ఎస్కలేషన్ భారం రాష్ట్రమే భరించాలని కేంద్రం ప్రకటించినప్పుడే, దాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది విభజన చట్టానికి వ్యతిరేకమని, ఈ కండిషన్ కు ఒప్పుకోవద్దని కూడా మిమ్మల్ని పలు లేఖల ద్వారా హెచ్చరించాను.
కానీ, మీరు నా లేఖలను నిర్లక్ష్యం చేసినందున, కేంద్రం పెట్టిన కండిషన్ లకు ఒప్పుకొంటూ ప్రాజెక్ట్ నిర్మాణం చేతుల్లోకి తీసుకున్నందున.. పోలవరం ఖర్చు రాష్ట్ర ఖజానాపై పడకూడదనే ఉద్దేశ్యంతో.. పోలవరం పూర్తి ఖర్చు విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాను. ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలైనా ఇంతవరకు కౌంటర్ కూడా వేయలేదు.
ఇప్పటికైనా, కనీసం భూసేకరణ, పునరావాస కార్యక్రమాలనైనా కేంద్ర ఆధ్వర్యంలో విభజన చట్టం చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా చేయించ గలిగితే.. రాష్ట్రాన్ని కొంతమేరకైనా ఆర్థిక భారం నుంచి కాపాడగలిగినవారు అవుతారు. లేదంటే.. రాష్ట్ర ఖజానాపై పడే ఈ అదనపు భారానికి పూర్తి బాధ్యత పూర్తిగా మీదే అవుతుంది. గ్రహించండి’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments