అందాల నటి శ్రీదేవి ఇకలేరనే వార్త జీర్ణించుకోవడం చాలా కష్టమైన పనే. అభిమానులను, సన్నిహితులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిన శ్రీదేవి ఇంకా మన మధ్యలోనే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంటుంది. ఆమె లేరనే విషయం గుర్తుకు వస్తే కంటతడి పెట్టుకోవడం సహజం. ఇలాంటి పరిస్థితి భర్త బోనికపూర్, మరిది అనిల్ కపూర్‌కు ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల్లో ఎదురైంది. ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తూ మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
బ్యాంకాక్‌లో ఐఫా వేడుక
బ్యాంకాక్‌లో 19వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా)ల కార్యక్రమం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు లభించింది. 2017లో రిలీజైన మామ్ చిత్రంలో నటనకుగానూ మరణాంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు.