మడతపెట్టడానికి వీలయ్యే కీబోర్డును దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని జేబులో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్లవచ్చని, కంప్యూటర్లకు, ల్యాప్‌ట్యాప్‌లకు అనుసంధానించుకోవచ్చని చెప్తున్నారు. దీని ధర కూడా చాలా తక్కువ. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని చాపలాగా చుట్టుకొని తీసుకెళ్లగలిగే కీబోర్డులు ఉన్నాయి. కానీ దక్షిణకొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన కీబోర్డును మాత్రం ఎలాగైనా మడతపెట్టవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ముందుగా ఒక సెన్సర్ షీట్‌ను అభివృద్ధి చేశారు. ఇది మృదువుగా ఉంటుంది. దానిపై సిలికాన్ రబ్బర్‌తో తయారు చేసిన మరో షీట్నును అమర్చారు. ఈ రెండింటి మధ్య కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్‌ను అనుసంధానించారు. రబ్బర్ షీట్ పైభాగంలో కీబోర్డ్‌లోని బటన్స్‌ను సూచించేలా గడులు గీశారు. ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని సూచిస్తుంది. మనం టైప్ చేసినప్పుడు వేళ్ల ద్వారా కలిగే ఒత్తిడి రబ్బర్షీట్ ద్వారా నానోట్యూబ్స్పై పడుతుంది.ఆ నానోట్యూబ్స్ అడుగున ఉన్న సెన్సర్ షీట్‌కు తగులుతుంది. అప్పుడు సెన్సార్లు ఏ అక్షరాన్ని టైప్ చేశామో గుర్తించి కంప్యూటర్‌కు పంపుతుంది. ఈ కీబోర్డ్ మిగతా కీబోర్డుల్లాగానే పనిచేస్తున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక కీబోర్డును తయారు చేయడానికి సుమారు రూ.68 (ఒక డాలర్) మాత్రమే ఖర్చవుతుందన్నారు.
Subscribe
Login
0 Comments