రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో తీర్పు వెల్లడైంది. ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1 మోర్ల శ్రీనివాసరావు, ఏ-2 జగదీష్, ఏ-3 పలగాని ప్రభాకర్‌రావు బావమరిది పంది వెంకటరావు గౌడ్.. ఈ ముగ్గురికీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అతినీచమైన, హేయమైన చర్యగా న్యాయమూర్తి అభివర్ణించారు. హత్య, కిడ్నాప్ కింద నేరాలు రుజువైనట్టు వెల్లడించి కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది.
ఉమ్మడి రాష్ట్రం విజయవాడలో 2010 జనవరిలో జరిగిన పలగాని నాగవైష్టవి హత్య కేసు తుది తీర్పు ఎనిమిదేళ్ల తర్వాత వెల్లడైంది. బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకటరామమ్మను చేసుకున్నాడు. వారికి దుర్గాప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లకు ప్రభాకర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు సాయితేజష్, నాగవైష్టవి సంతానం. పాప వైష్టవి పుట్టిన తరువాతే తన దశ తిరిగిందన్నది ప్రభాకర్ నమ్మకం. గారాలపట్టి వైష్టవి పేరుతో ఆస్తులన్నీ పెడుతున్నాడన్న భావన మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావులో బలంగా ఏర్పడింది. దీంతో వైష్ణవిని చంపాలని నిర్ణయించుకున్న వెంకటరావు, తన చిన్నమ్మ కొడుకు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. జనవరి 30న చిన్నారి వైష్ణవిని కిడ్నాప్ చేసి చంపేశారు. తర్వాత ఆమె శవాన్ని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.