అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు కావొస్తుంది.. అయినా చనిపోయిన లాడెన్‌ను చంపాలనుకోవడమేంటని అనుకుంటున్నారా? ఇక్కడ లాడెన్‌ అన్నది ఓ మగ ఏనుగు పేరు. దాని రూపం, ఎత్తు చూసి అసోంలోని గోల్‌పరా అటవీ ప్రాంత ప్రజలు దానికి ఆ పేరు పెట్టారు. అడవి చుట్టు పక్కల నివసిస్తున్న ప్రజలకు లాడెన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 37 మందిని చంపినట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మదపుటేనుగుగా మారిన లాడెన్‌ను చంపి దాని బారి నుంచి ప్రజల్ని రక్షించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులను అనుమతి కోరారు.

వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని గోల్‌పరా అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రజలపై లాడెన్‌ దాడి చేసి చంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 1న పట్‌పారా పహర్‌టోలి గ్రామానికి చెందిన మనోజ్‌ హజోంగ్‌ అనే వ్యక్తి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అడ్డువచ్చిన అతన్ని తొక్కి చంపేసింది. అటవీ సంరక్షణాధికారులు మాట్లాడుతూ..  లాడెన్‌ గోల్‌పరా అడవుల్లో అడుగుపెట్టిన తర్వాత దాదాపు 37 మందిని చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కువగా సాయంత్రం, రాత్రి సమయాల్లో దాడి చేస్తోందన్నారు. ఏనుగుల గుంపును చూసిన వెంటనే గిరిజనులు వాటిని తరమటానికి చేసే ప్రయత్నం వల్ల ఒక్కో సారి ఏనుగులు దాడికి తిరగబడే అవకాశం ఉందన్నారు.

ఒంటరిగా ఉన్న ఏనుగులు చాలా ప్రమాదకరమని తెలిపారు. దాడి జరిగిన ప్రతిసారి 10-15 రోజులు ఆ ఏనుగు కనిపించకుండా పోతోందన్నారు. చాలా దాడులు నెలలోని చివరి రోజుల్లో జరిగాయన్నారు. లాడెన్‌ను మదపుటేనుగుగా గుర్తించి చంపటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. 2006లో సోనిత్‌పుర్‌ జిల్లాలోని లాడెన్‌ అనే ఓ ఏనుగును మదపుటేనుగా గుర్తించి చంపటం జరిగిందన్నారు. గిరిజనులు రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు సూచించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments