సరిగ్గా 29 ఏళ్ల క్రితం… 16 ఏళ్ల ముంబై కుర్రాడు పాకిస్తాన్‌లో జేగంట మోగించాడు. పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు తర్వాత భారత క్రికెట్ చరిత్రనే మార్చేశాడు. అతనెవరో ఈపాటికే అర్థమైవుంటుంది… సచిన్ టెండూల్కర్ అని! 24 ఏళ్లపాటు భారత క్రికెట్‌ను నడిపించి, ఒక తరాన్ని అతను ఊపేశాడు. మళ్లీ ఇప్పుడు అతని గారాల తనయుడు అర్జున్ టెండూల్కర్ వంతు వచ్చినట్లుంది. వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ వచ్చిన అర్జున్ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్. జాతీయ అండర్–19 టోర్నీ కూచ్‌బెహర్ ట్రోఫీలో ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది.ఏదేమైనా ఎన్నో అంచనాల మధ్య, సచిన్ అభిమానుల ఆశీస్సులతో అర్జున్ బంతితో రె‘ఢీ’ అంటున్నాడు.