కేరళ సీఎం పినరయి విజయన్‌ను హతమారుస్తానంటూ దుబాయ్‌కు చెందిన భారతీయుడు హెచ్చరించడం కలకలం రేపింది. సీఎంను అంతమొందించేందుకు త్వరలో కేరళ వెళతానని ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారుడైన కృష్ణకుమార్‌ ఎస్‌ఎన్‌ నాయర్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో పేర్కొన్నాడని ఖలీజ్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. తాను మాజీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తనని, మళ్లీ చురుకుగా సంఘ్‌ కార్యకలాపాల్లో పాల్గొంటానని..ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళ వెళతానని ఈ వీడియోలో నాయర్‌ పేర్కొన్నారు.

కేరళ సీఎంను చంపేందుకు తాను రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని, తన జీవితం ఏమై పోయినా తనకు బాధలేదని అన్నారు. ఓ వ్యక్తిని అంతమొందించాలని మనం అనుకుంటే మనం ఆ పని పూర్తిచేయాల్సిందేనని ఆ నాలుగు నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అబుదాబికి చెందిన టార్గెట్‌ ఇంజనీరింగ్‌ కన్‌స్ర్టక్షన్‌ కంపెనీలో సీనియర్‌ రిగ్గింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసే నాయర్‌ విజయన్‌ను దుర్భాషలాడుతూ ఆయన కులంపైనా వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌కు గాను నాయర్‌ను బుధవారం విధుల నుంచి తొలగించారు. అన్ని లాంఛనాలు పూర్తయిన వెంటనే ఆయనను కేరళకు పంపనున్నారు. తన ఉద్యోగం పోయిందని, తనపై ఎలాంటి చర్యలూ చేపట్టినా తాను సిద్ధంగా ఉన్నానని..ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారుగానే కొనసాగుతానని నాయర్‌ చెప్పారు. తీవ్ర వ్యాఖ్యలు చేసిన తనను మన్నించాలని పినరయి విజయన్‌ను ఆయన వేడుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments