ఎయిర్ ఏషియా కుంభకోణం ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు పేర్లు బయటపడ్డాయని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అశోక్ గజపతిరాజు అవినీతికి పాల్పడ్డారని, నిజానిజాలు సీబీఐ విచారణలో బయటకొస్తాయని అన్నారు.

2016 మే 20న పర్మిట్లలో మార్పులు చేస్తూ జీవో జారీ చేశారని, ఈ జీవోలో ఎయిర్ ఏషియాకు అనుకూలంగా నిబంధనలు సవరించారని ఆరోపించారు. ఇదంతా జరగడానికి ముందే, ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ, ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓలు అడ్డదారిలో అనుమతులు సంపాదించే విషయమై ఫోన్ లో మాట్లాడుకున్నారని, ఆ ఆడియో క్లిప్పే ఇప్పుడు బయటకొచ్చిందని అన్నారు.

ఈ కుంభకోణంలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజులకు కచ్చితంగా వాటా ఉందని ఆరోపించారు. వీళ్లిద్దరూ ఏపీ పరువుని అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారని, వీళ్లు నిజాయతీపరులైతే కనుక విచారణ కోరుతూ కేంద్రానికి ఓ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై కూడా విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతున్న భాష సరిగా లేదని, తన హోదా మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments