ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికురాలిపై ఓలా డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దుస్తులు విప్పించి, ఫొటోలు తీసుకుని వాటిని వాట్సాప్‌లో షేర్ చేశాడు. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 1న నగరానికి చెందిన ఓ ఆర్కిటెక్ట్ (26) విమానాశ్రయానికి వెళ్లేందుకు అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఓలా క్యాబ్‌ను బుక్ చేసింది. ఈ క్రమంలో టోల్ గేటు సమీపంలోకి రాగానే అడ్డదారి గుండా ట్యాక్సీని పోనిచ్చాడు. ఇదేంటని ప్రశ్నించిన ఆమెకు అడ్డదారని, వేగంగా వెళ్లొచ్చని నమ్మబలికాడు. అనంతరం విమానాశ్రయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి ఆమెను బంధించాడు.

ఆమె మొబైల్‌ను లాక్కున్నాడు. అరిచేందుకు ప్రయత్నిస్తే స్నేహితులను పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడతామని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమెను బెదిరించి దుస్తులు విప్పించి ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం వాటిని వాట్సాప్‌లో షేర్ చేశాడు.

అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ విషయం ఎవరితోనూ చెప్పనని, తనను ఎయిర్‌పోర్టులో విడిచిపెట్టాలని బాధిత మహిళ అభ్యర్థించడంతో చివరికి ఆమెను విమానాశ్రయంలో వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు.

అనంతరం బాధిత మహిళ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం వేట ప్రారంభించారు. మూడంటే మూడు గంటల్లో డ్రైవర్‌ అరుణ్‌ను అరెస్ట్ చేశారు. ఓలా యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. డ్రైవర్ వెరిఫికేషన్‌ను ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ధైర్యంగా తమకు ఫిర్యాదు చేసిన మహిళను అభినందిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి సీమంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా, ఓలా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇదో దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. డ్రైవర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments