‘సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై ఆరోపణలు చేసిన వారు సిద్ధమా?’ అని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సవాల్‌ విసిరారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారని విమర్శించారు.బాలసుబ్రమణ్యం హయాంలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారని, దీని వెనుక ఆయనకు లాభార్జన ఉందని ఆరోపించారు. సోమవారం సికింద్రాబాద్‌లో దీక్షితులు విలేకరులతో మాట్లాడారు. ‘బాలసుబ్రమణ్యం నన్ను రోజుకు 50 రూపాయలు కూలీ అని ఏర్పాటు చేశారు. అది నెలకు రూ.3వేలు నుంచి రూ.7 వేలు అయ్యింది. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు రూ.60వేలు వేతనంగా ఇచ్చారు. అదికూడా కోర్టు నిర్ణయం మేరకే’ అని తెలిపారు. తన ముందే డాలర్‌ శేషాద్రిని ప్రధాన అర్చకునిగా చెప్పేవారని, వీఐపీలు వస్తే కనీసం అర్చకునిగా కూడా పరిచయం చేసేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వెయ్యికాళ్ల మండపాన్ని కాపాడాలని, మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తప్పనిసరైతే మరోచోట నిర్మించాలని వినతిపత్రం ఇచ్చానని తెలిసి వంశ పారంపర్యంగా ఉన్న నా ఇంటిని కూల్చివేశారు. ధర్మారెడ్డి ఉద్యోగం కోసం క్రైస్తవ మతం మారిన ఘనత ఉంది. ఈ విషయం ఢిల్లీలో హోంశాఖ వారి ద్వారా తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఈ ధర్మారెడ్డి పదవీకాలంలోనే నాపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది’ అని ఆరోపించారు. ప్రతాపరుద్రుడు స్వామి వారికి సమర్పించిన అమూల్యమైన సంపద.. అన్నపోటు వద్ద నిధిగా ఉందని బ్రిటీష్‌ శాసనంలో ప్రస్తావించారన్నారు. అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆయన తెలిపారు. అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్‌ చేశారని ఆరోపించారు. జేఈవోల నిరంకుశత్వాన్ని, బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రశ్నించకూడదా అని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తిరుమలలో వేంకటేశ్వరస్వామి నగల విషయంలో వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని స్వామీజీలు, పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. తిరుమల పవిత్రత సంరక్షణపై విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో వారు హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే జూన్‌ 9న తిరుపతిలో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments