వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మకమని, ఆయన ప్రజలతో మమేకమవుతూ ఇప్పటి వరకు 2 వేల కిలోమీటర్లకు పైగా నడిచారంటే ఆశ్చర్యంగా ఉందని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా స్ప్రింగ్ బోర్డు అకాడమీలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం తణుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై పాదయాత్రలు చేసిన వారికి ఇప్పటి వరకు అపజయం ఎదురైన సందర్భం రాలేదని చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం పాదయాత్ర చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డిలో ఉన్న మానవత్వాన్ని తాను దగ్గరగా చూశానని చెప్పారు.
తాను హీరోగా కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓటరు చిత్రం ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింభిస్తుందన్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో విద్యార్థికి వచ్చిన ర్యాంకులు, మార్కులే ప్రామాణికంగా చూస్తున్నారని, ఇది కరెక్టు కాదని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. శ్రీ విద్యానికేతన్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో స్ప్రింగ్‌బోర్డు నెలకొల్పామన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో తణుకు బ్రాంచి విజయవంతంగా కొనసాగుతుండగా ఇటీవలనే మండపేటలో మరో బ్రాంచి మొదలు పెట్టామన్నారు. ఉన్నత ప్రమాణాలతో త్వరలో హైదరాబాద్‌లో జర్నలిజం స్కూలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్ప్రింగ్‌బోర్డు స్కూల్ ప్రిన్సిపాల్ కె.రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.