పార్వతీపురం జనసేన పోరాట యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిరసన కవాతు అనంతరం జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఓ అభిమానిపై ఆయన దృష్టిపడింది. అతను చొక్కా విప్పి.. అదే పనిగా చేత్తో ఊపుతుండటాన్ని గమనించిన పవన్.. ఆ యువకుడి ఛాతిపై తన పచ్చబొట్టు ఉండటాన్ని గుర్తించారు. “పచ్చబొట్టా అది.. గుండెల్లో ఉన్నావు… గుండెల్లోకి వచ్చావు.. అది చాలు” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ యువకుడిని ప్రత్యేకంగా చూపించమని కెమెరామెన్‌కు చెప్పి.. అందరి దృష్టి పడేట్టు చేశారు. పవన్ కల్యాణ్‌కు అభిమానులపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమంటున్నాయి జనసేన వర్గాలు. పవన్ ఎక్కడున్నా తన వారిని ఇట్టే గుర్తిస్తారని.. వారికి తన ప్రేమను అందించడంలో ముందుంటారని చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ దృష్టిలో పడటంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేవు. తన స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకుని మహానందంలో మునిగిపోయాడు.