కర్ణాటకలో కుమార స్వామి నాయకత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. మంత్రి పదవుల పంపకంపై జేడీఎస్, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. బుధవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మొదట్లో అనుకున్నారు. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఉప ముఖ్యమంత్రి పదవి, మరికొన్ని మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు ఆగితే కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. దీంతో పరిపాలన సాధారణ స్థాయికి చేరలేదు. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ రెండు పార్టీలకు సున్నితంగా ఓ హెచ్చరికలాంటి సందేశం ట్వీట్ చేశారు.
‘‘కర్ణాటక…… డియర్ జేడీఎస్, కాంగ్రెస్. వారమవుతోంది. దయచేసి త్వరగా మంత్రి పదవులను ఖరారు చేసి, మంత్రివర్గాన్ని ప్రకటిస్తారా? ప్రభుత్వం ఏర్పడాలని, పరిపాలన సాగాలని ప్రజలం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.