విజయవాడలోని కానూరు వీఆర్‌ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో నేటి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ ‘మహానాడు’ జరగనుండగా, ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇక్కడి నుంచే సమరశంఖాన్ని పూరించనున్నారు. ఈ ఉదయం 8.30 గంటల నుంచి ప్రతినిధుల నమోదు ప్రారంభం కానుండగా, ఆపై డ్వాక్రా బజార్‌, ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. మహానాడు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో మొత్తం 36 తీర్మానాలను టీడీపీ నేతలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీకి సంబంధించి 20, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలు ఇందులో ఉంటాయి.

ఇక మహానాడుకు దారితీసే మార్గాలు తెలుగుదేశం జెండాలు, స్వాగత తోరణాలు, నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. విజయవాడ రహదారులు పుసుపు రంగుతో నిండిపోయాయి. వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో ఎటువైపు చూసినా పసుపు జెండాలే కనిపిస్తున్నాయి. వేదిక సమీపంలో ఎన్టీఆర్‌, చంద్రబాబుల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహానాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 120/60 అడుగుల అతిపెద్ద వేదిక సిద్ధమైంది. దీనిపై దాదాపు 400 మందిని కూర్చోబెట్టనున్నారు. వీఐపీలకు అతిథులకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఎండల తీవ్రత దృష్ట్యా కూలర్లు, ఏసీలను ప్రాంగణమంతా పెట్టారు. ఎవరికీ ప్రత్యేక పాస్ లు ఇవ్వకుండా, పార్టీ సభ్యత్వ కార్డే పాస్ గా కార్యకర్తలను లోపలికి పంపాలని నిర్ణయించడం ఈ సమావేశాల ప్రత్యేకత.
ఇక మహానాడుకు వచ్చిన వారందరికీ, ముప్పూటలా రుచికరమైన విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 వేల మందికి ఉదయం టిఫిన్, 40 వేల మందికి రెండు పూటల భోజనం సిద్ధం అవుతుండగా, దాదాపు 20 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖుల కోసం ప్రధాన వేదిక వెనుక భోజన వసతి ఏర్పాటైంది. సుమారు 2 వేల మంది కూర్చుని తినడానికి, మిగతావారికి బఫే సిస్టమ్ లో భోజనాలు అందనున్నాయి.

తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తరువాత, విజయవాడలో జరిగే నాలుగో మహానాడు ఇదే కావడం గమనార్హం. గతంలో 1983, 1998, 2000 సంవత్సరాల్లో మహానాడు విజయవాడలో జరిగింది. 1983, 2000 సంవత్సరాల్లో సిద్దార్ధ కళాశాల వేదికకాగా, 1988లో మాత్రం తాడేపల్లి సమీపంలోని కృష్ణానది ఒడ్డున 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు జరిగింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments