ఈరోజు , రేపు , ఎల్లుండి మూడు రోజుల పాటు తెలుగుదేశం మహానాడు జరగుతున్న విషయం తెలిసిందే . ఈ మహానాడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఆపై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి గుండెల్లో నిలిచిఉందే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ భారతదేశంలో 70 లక్షల మందికి పైగా కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు . ఎంతో మంది కార్యకర్తల కష్ట ఫలితంగానే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పధంలో పయనిస్తోందని , కార్యకర్తలు లేకుంటే పార్టీయే లేదన్నారు . గతంలో టీడీపీ వేసిన పునాదుల వల్లే ఇప్పుడు తెలుగువారు విదేశాల్లో రాణిస్తున్నారని తెలిపారు . సమీప భవిష్యత్తుల్లో ఏ ఎన్నిక జరిగినా విజయం తెలుగుదేశానికే అని అన్నారు . ఇండియాలో సంక్షేమ పధకాలకు నాంది పలికింది ఎన్టీఆర్ మాత్రమేనని ఆ తరువాత మిగతా రాష్ట్రాలు అనుసరించాయని చంద్రబాబు తెలిపారు .

హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్ కు అధికారాన్ని దూరం చేసిందని , ఆపై రాష్ట్రానికి చేస్తానన్న సహాయం చేయకుండా అన్యాయం చేసిన బీజేపీ కి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు . రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు తాత్కాలికమేనని , మరో నాలుగేళ్ళలో దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా నిలిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు . ఇంకా మాట్లాడుతూ తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన మూడు నెలలలోనే కరెంటు కష్టాలు తీర్చామని , భవిష్యత్తులో కరెంటు చార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments