జనసేన పోరాట యాత్ర నాల్గోవ రోజు టెక్కలి సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ విదేశాలలో మత్స్యకారులకు అన్ని సదుపాయాలూ, మరపదవాలు ఇవ్వగలుగుతుంటే, ఇంత తీర ప్రాంతం ఉండి, లక్షల మత్స్యకారుల కుటుంబాలున్న మన రాష్ట్రంలో ఏమి సదుపాయాలూ కల్పించారని ప్రశ్నించారు. జనసేన తరపున తాము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం గెలుపు కోసం భుజం కాస్తే, వాళ్ళు అధికారంలోకి వచ్చి తమ బుజాన్ని నరికేస్తునారన్నారు.
పవన్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, నేను మీకోసం ప్రచారం చేశా, కాని మీరిక్కడి ప్రజల అభివృద్ధిని గాలికొదిలేశారు అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ ఒక్క పదవి కూడా ఆశించకుండా మీ భుజం కాస్తే మీరు ఒక వర్గానికి పరిమితమవుతాము అంటే ఎలా అని అచ్చెన్నాయుడు ఉద్దేశించి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త రాజకీయ మార్పు రావాలని , సరికొత్త రాజకీయ వ్యవస్థ అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు.
పవన్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడున్న యువత అందరూ కలిసి మనం కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిద్దామని పిలుపునిచ్చారు . తాను కడుపు మండి మాట్లాడుతున్నానని , 48 గంటలలోపు ఆరోగ్య శాఖ మంత్రిని నియమించి విధి విధానాలు రూపొందించకపోతే తాను నిరాహారదీక్షకు కూర్చుంతానని అన్నారు.
ఉద్దానం సమస్యపై జనసేన అధ్యయనం చేసి , అమెరికా నుండి వైద్యులను తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ ధర్మ పోరాట దీక్షకు 40 లక్షలు ఖర్చు పెట్టగలిగినప్పుడు ఇక్కడ ఉద్దానం బాధితులకు కనీసం మంచి తాగునీరు కూడా అందించాలేరా అని మండిపడ్డారు. గత రాత్రి తను బస చేసిన చోట కరెంటు ఆఫ్ చేయించి తనపై దాడికి యత్నించారని , ఎవరు ఎంత బెదిరించినా తాను అన్నిటికి తెగించి వచ్చానని, ఎవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేసారు.