ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ప్రస్తుతం ప్రజా సమస్యలను అధ్యయనం చేయడంలో బిజీగా ఉన్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన, రైతుల సమస్యలు తీరే సమయం దగ్గరకొచ్చిందని వ్యాఖ్యానించారు.
అలాగే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే టైమొచ్చిందని అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే తన లక్ష్యమని వెల్లడించారు. లక్ష్మీ నారాయణకు తమ సమస్యలు ఏకరవు పెట్టిన రైతులు, పంటలను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హోల్ సేల్ వ్యాపారులకు తాము పంటను విక్రయిస్తుంటే, తమకు తక్కువ ధర ఇచ్చి, బహిరంగ మార్కెట్ లో దళారులు అధిక ధరలతో వాటిని ప్రజలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు.