టీటీడీ పాలకమండలి సమావేశంలో 65 సంవత్సరాల వయసు దాటిన అర్చకులకు పదవీ విరమణ ప్రతకటించడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం పై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు,పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని,శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయని తెలిపారు. 2012 లోనే అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి అమలులోకి వచ్చిందని,ఆ సమయంలో ముగ్గురు అర్చకులు పదవీ విరమణ పొందారని,అప్పుడు ఆ ముగ్గురు అర్చకులు కోర్టుకు వెళ్ళారని ,వారి విజ్ఞప్తి ని కోర్టు తిరస్కరించిందని, జీతభత్యాలు లేకుండా అర్చకులుగా కొనసాగోచ్చని కోర్టు తెలిపిందన్నారు.
అలాగే ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం కల్పించాలని గొల్లపల్లి కుటుంబానికి చెందిన వేణుగోపాల దీక్షితులు కోర్టుకెళ్లారని ఈవో తెలిపారు. సర్వీస్ ప్రకారం టీటీడీలో సేవలందించిన సీనియర్‌కు ప్రధాన అర్చకులుగా నియమించడం జరిగిందని సింఘాల్ తెలిపారు. ప్రధానంగా రమణ దీక్షితులు చేసిన విమర్శలపై ఈవో సింఘాల్ మీడియా ద్వారా భక్తులకు వివరణ ఇచ్చారు. భక్తులకు వాస్తవాలు తెలియజేసేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు