నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘ఆఫీసర్’ సినిమా కథ తనదేనని జయకుమార్ అనే రచయిత పోరాటానికి సిద్ధమయ్యాడు. గతంలోనూ వర్మపై ఆరోపణలు చేసి కేసు కూడా పెట్టిన జయకుమార్ మరోమారు పోరాటానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు మీడియాకు ఓ లేఖ విడుదల చేశాడు .
తన పేరు జయకుమార్ అనీ, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ నటించిన ‘సర్కార్ 3’ సినిమాతో రచయితగా పరిచయమయ్యానని పేర్కొన్న ఆయన 2015లో తొలిసారి వర్మను కలిశానని పేర్కొన్నాడు. అదే ఏడాది జనవరిలో ఇద్దరు పోలీస్ అధికారులపై తాను రాసుకున్న కథ గురించి వర్మకు చెబితే ఆయన ఆసక్తి చూపడంతో ఈమెయిల్ ద్వారా స్క్రిప్ట్‌ను ఆయనకు పంపినట్టు వివరించాడు. అది చూసి కథలో కొన్నిమార్పులు చేర్పులు కోరారని, ఆయన చెప్పినట్టు చేసి తిరిగి పంపించానని వివరించాడు. ఆ తర్వాత ‘ఆఫీసర్’ సినిమా ప్రొడక్షన్ మొదలైనప్పుడు కంపెన్సేషన్, క్రెడిట్ ఇస్తానని హామీ ఇచ్చిన వర్మ తర్వాత తననెప్పుడూ సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
వర్మ కాపీకొట్టి తీసిన మరో ప్రాజెక్టు మీద ఇప్పటికే హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో కేసు వేసినట్టు జయకుమార్ వివరించాడు. తన కథను గుడ్డిగా కాపీ కొట్టి సినిమా తీయడం తనకు బాధ కలిగిస్తోందన్నాడు. ‘‘నా అనుమతి లేకుండా, నా హక్కులను ఉల్లంఘించి, నా సినిమా భవిష్యత్తును వర్మ దెబ్బతీశాడు’’ అని జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్ర పరిశ్రమలోని పెద్దలు ముందుకొచ్చి తనకు అండగా నిలవాలని, తనకు న్యాయం చేయాలని జయకుమార్ అభ్యర్థించాడు.