మాజీ మంత్రి వర్యులు,మాజీ  తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రముఖ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలను వెల్లడించారు. బంగారు తెలంగాణలో వ్యవసాయం పండుగలా అవుతుందని,రైతు గౌరవంగా బ్రతుకుతాడని అందరూ భావించారని కాని తెలంగాణ వచ్చాక రైతు బ్రతుకు తెల్లారిందని,రైతు బ్రతుకు మారితేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితం దక్కినట్టు కాని ఉద్యమ నేపధ్యంలో సాధించుకున్న తెలంగాణ లో అన్నదాత బ్రతుకు ఆగమవుతున్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ 1998 నుంచి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ నినాదాన్ని ప్రకటించిందని,ప్రపంచ బ్యాంకు నిపుణులు,చాలా మంది ఆర్ధిక వేత్తలు వ్యతిరేకించారని,కానీ రైతు ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా ఉన్న 2004 లో అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఉచిత విధ్యుత్ పై తమ ప్రభుత్వం చేసిందన్నారు. అప్పట్లో దాదాపు 18లక్షల వ్యవసాయ విధ్యుత్ పంపుసెట్లు ఒక్క తెలంగాణ లోనే ఉండేవని,అంటే ఉచిత విధ్యుత్  తెలంగాణ రైతాంగానికే ఎక్కువ ఉపయోగపడే పధకం అన్నారు. అప్పట్లో కరెంటు బకాయిలు 12 వందల కోట్లు మాఫీ చేయడం,రైతులపై ఉన్న కేసులన్నీ మాఫీ చేయడం లాంటి విప్లవాత్మక చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టాయన్నారు. అలాగే పత్తి రైతుల విషయంలో విత్తనాల దోపిడీని అరికట్టి దాదాపు రూ.1800 ఉన్న పత్తివిత్తనాల సంచిని కేవలం రూ.650కు ఇచ్చి రైతులకు మనోధైర్యాన్ని కల్పించామన్నారు.

కేసీఆర్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పారని,తీరా ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే అనడంతో రైతులనుండి వ్యతిరేకత రావడంతో రుణ మాఫీకి ప్రణాళిక మొదలుపెట్టారన్నారు. 17 వేల కోట్ల రూపాయలను నాలుగు విడతలుగా అంటూ మళ్ళీ మెలికపెట్టారని,దానికి వడ్డీ భారం పెరగడంతో అది తప్పించుకునేందుకు అసెంబ్లీలో హామీ ఇచ్చి కూడా నిధులు ఇవ్వకుండా దాటవేసి,ఇప్పుడు ఎకరానికి 4 వేల చొప్పున 8 వేలు ఇస్తామని రైతు బంధు పధకం అమలు చేస్తున్నారన్నారు. కాని కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదంటే సమాధానం లేదని,ఇప్పుడు దాదాపు 12 లక్షల మంది కౌలు రైతులు తమ కష్టం మీదే ఆధారపదవదలసి వస్తుందన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని పదేపదే గొప్పలు చెబుతున్న కేసీఆర్ దానివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలున్నాయో చెప్పడం లేదని,నిరంతర విద్యుత్ తో భూగర్భ జలాలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని,ఈ నాలుగేళ్ళలో దాదాపు 4,200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ నేర నమోదు సంస్థ తెలిపిందన్నారు. ఇంతమంది బలైపోతున్నా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకున్న పరిస్తితులు లేవని వాపోయారు.

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,వరి మొదలుకొని మొక్కజొన్న,జొన్నలు,ఎర్ర జొన్నలు,పత్తి,మిర్చి కూర గాయాలు ఇలా ఏ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లేవని,టమోటా,పండ్ల వ్యాపారులు ఏకంగా వారి పంటలను కాల్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధరల విషయానికొస్తే 2004 లో క్వింటాల్ ధర 560 రూపాయలు ఉంటే 2014 నాటికి కాంగ్రెస్ క్వింటాల్ ధర 1350 రూపాయలకు పెంచిందని,అంటే పదేళ్ళలో సంవత్సరానికి 14.1 శాతంచొప్పున మద్దతు ధర తమ ప్రభుత్వంలో పెంచామని,ఇప్పుడు కేవలం 1350 నుండి 1560 రూపాయలకు ధర పెంచారని,అంటే 15.6 శాతం పెరిగిందన్నారు.

ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్ళలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని,కేంద్రం ఇచ్చే యాభై శాతం నిధులు కూడా తీసుకోలేదన్నారు. తెలంగాణాలో ప్రభుత్వం రెండు పంటలు పండే భూములను సరైన నష్ట పరిహారం లేకుండా బలవంతంగా తీసుకున్నారన్నారు.  కొండపోచమ్మ సాగర్,మల్లన్న సాగర్,ఫర్మా సిటీస్ వంటి పనుల విషయంలో భూములు తీసుకుంటే ఇప్పటికీ రైతులు నిరాహార దీక్షలు చేస్తూనేఉన్నారన్నారు.

అకాల వర్షాలు,వడగళ్ళు, కరువు తదితర ప్రకృతి వైపరీత్యాల విషయంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా బీమా డబ్బులు చెల్లించలేదన్నారు. లక్షన్నర ఎకరాలు నష్టపోయినట్టు ప్రభుత్వం ప్రకటించినా ఎలాంటి నష్టపరిహారాలు ఇవ్వలేదని,ఇలా ప్రభుత్వ వైఖరి ఉండడంతో తెలంగాణాలో వ్యవసాయం పెద్ద గుదిబండగా మారిపోతోందన్నారు. ప్రభుత్వం తక్షణమే రుణ మాఫీ వల్ల రైతులు పడ్డ వడ్డీ భారాన్ని చెల్లించి,వడగళ్ళ వానలు,తుఫాన్లు,కరువు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతలులకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ ఏడాదే మొదలవుతున్న పెట్టుబడి పధకంలో కౌలు రైతులను కూడా చేర్చి ఆదుకోవాలన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments