ముఖ్యమంత్రి చంద్రబాబును రాక్షసుడితో పోల్చారు వైసీపీ అధినేత జగన్‌. ఆయన పరిపాలన చూస్తే.. రాక్షసుడు పొరపాటున మనిషిగా పుట్టాడని అనిపిస్తోందని అన్నారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై అలిపిరిలో ఉద్దేశపూర్వకంగానే రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడి చంద్రబాబే చేయించారని.. అయినా దానిని ఒప్పుకొనే దమ్ము, ధైర్యం లేక ఖండనతో సరిపెట్టి తూచ్‌ అంటూ ప్లేటు ఫిరాయించారని జగన్‌ విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం కృష్ణాజిల్లా కైకలూరులో జరిగిన బహిరంగసభలో ఆయన ఈ విమర్శలు చేశారు.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే రాళ్లదాడి చేయించారని.. ఈ దాడి పత్రికల్లో పతాక శీర్షికల్లో రావాలనే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల కొండపై బీజేపీకి చెందిన మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్యకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చి, కొండ దిగువన అమిత్‌షాపై రాళ్ల దాడి చేశారని విమర్శించారు. సీఎంగా రూ.4 లక్షల కోట్ల దోపిడీ చేశారని, ఆ అవినీతిపై విచారణ జరుగుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు. త్వరలో ఎన్నికలు రానున్నందున ప్లేటు ఫిరాయించి, ప్రత్యేకహోదా కొరకు పోరాటం చేస్తున్నట్లు సీఎం జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ‘ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతారు. యుద్ధభూమికి వెళితే చెమటలు పట్టి తడిసిపోతారు. డైలాగులకు ఎక్కువ, సైకోకు తక్కువ’ అని వ్యాఖ్యానించారు. ముందు నుంచి ప్రత్యేకహోదా కోసం వైసీపీ పోరాడుతోందని చెప్పారు. సీఎం కొంగ జపం, దొంగ దీక్షలు చేస్తున్నారని జగన్‌ విమర్శించారు.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments