చిన్నప్పటినుండే సావిత్రి గారి అభిమానిని…

0
488

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించిన ‘మ‌హాన‌టి’ ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల్ని ఈరోజు ఉదయం తన ఇంటికి ఆహ్వానించి స‌న్మానించారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. “నా అభిమాన న‌టి సావిత్రి గారు. నేను మొద‌టిసారి ‘పునాది రాళ్లు’ సినిమాలో కెమెరా ముందు నిల‌బ‌డ్డాను. అందులో సావిత్రి హీరోకి త‌ల్లిగా న‌టించారు. హీరో స్నేహితుల పాత్ర‌ల్లో నాది ఒక‌టి. ఆ సినిమాలో రెండు మూడు సీన్లలో సావిత్రి గారితో ప‌నిచేసే అవ‌కాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వ‌య‌సు నుంచే ఆమెకు నేను వీరాభిమానిని. ఆ విష‌యాలు ఆమెతో చెప్ప‌గానే నా గురించి అడిగి, భ‌విష్య‌త్ లో పెద్ద‌స్టార్ అవ్వాల‌ని దీవించారు. అది అద్భుత‌మైన సంఘ‌ట‌న‌.

అలాంటి మ‌హాన‌టిపై నిర్మాత ద‌త్ గారు బ‌యోపిక్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్ యంగ్ డైరెక్ట‌ర్. త‌న తొలి సినిమా బాగుంది. కానీ త‌న అనుభ‌వంతో ఈ సినిమా ఎలా చేయ‌గ‌ల‌డ‌నే మీమాంస నాలో ఉండేది. ఎంత‌వ‌ర‌కూ దీనికి న్యాయం చేయగ‌ల‌డ‌ని సందేహాలుండేవి. కానీ, సినిమా చూసిన త‌ర్వాత నా అనుమానాలు పటాపంచలు అయిపోయాయి.

సినిమా చూస్తున్నంత సేపు హృదయం బ‌రువెక్కింది. క‌ళ్లు చెమ‌ర్చాయి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని, కీర్తిని జాతీయ‌, అంత‌ర్జాతీయంగా మరో మెట్టు ఎక్కించారు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది అన‌డం కంటే జీవించింది అన‌డం క‌రెక్ట్. దుల్కర్ సల్మాన్ జెమిని గ‌ణేష్ గారిలానే అద్భుతంగా న‌టించారు. ఈ సినిమాకు రివార్డులే కాదు.. అవార్డులు కూడా వ‌స్తాయి. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలి.

మే 9న నా ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’ సినిమా రిలీజైంది. అదే రోజున ‘మ‌హాన‌టి’ కూడా రిలీజైంది. అనుకోకుండా జ‌రిగిందో.. కావాల‌ని అలా ప్లాన్ చేశారో తెలియ‌దు గానీ, చాలా సంతోషంగా ఉంది. అందుకు మ‌హాన‌టి టీమ్ అంద‌ర్నీ అభినందిస్తున్నాను” అన్నారు. ఈ స‌మావేశంలో అశ్వినీ దత్, నాగ్ అశ్విన్, స్వప్న దత్, ప్రియాంక దత్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here