ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహానటి’ మూవీ విడుదల రోజు రానే వచ్చింది. మే 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే పరిచయం చేసిన పాత్రలు, ఆ పాత్రలు చేస్తున్న నటీనటులతో ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రంకి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు కూడా తోడయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి మహానటి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘ఎందరో నటీమణులున్నారు. కానీ ఒక్కరే మహానటి. నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏమిటంటే.. నా కెరీర్‌కి పునాది వేసిన పునాదిరాళ్లు చిత్రంలోనే వారితో కలిసి నటించడం జరిగింది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమనటి, కళ్ల కదిలికతోనే హావభావాలు పలికించి, తాను కదలకుండా కథనంతా నడిపించగలిగే మహానటి ఒక్క సావిత్రిగారే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ ఈ చిరంజీవి మనస్సులో ఎప్పటికీ చిరంజీవే. అలాంటి మహానటి మీద బయోపిక్ సినిమా తీసి, నేటి తరాలకి ఆమె గొప్పతనం గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…’’ అని తెలిపారు.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments