ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించడానికి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు రాంకీ, ప్రొఫెసర్ సదాశివరెడ్డితో పాటు 13 జిల్లాల నుంచి ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం హోదా సాధన సమితి సభ్యులు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మే 22న అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి హోదాకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించామని.. ఇందుకు అనుకూలంగా తీర్మానాలు చేయని వారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు జూన్‌లో గానీ, జూలైలో గానీ బస్సు యాత్ర చేపట్టడంతోపాటు.. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగ్గొచ్చేలా ఒక మెరుపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.