- టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో పార్టీ నేతల సమావేశం
- వైసీపీ, విపక్షాల కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించాలి
- ప్రతి జిల్లాలో ధర్మపోరాట సభ, సైకిల్ యాత్రలు చేపట్టాలి
- చంద్రబాబు ఆదేశాలు
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ చేస్తున్న పోరాటంలో భాగంగా టీడీపీ ధర్మపోరాటం సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా జరిగే ధర్మపోరాట సభ తేదీ ఖరారైంది. ఈ నెల 22వ తేదీన అక్కడ ధర్మపోరాట సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, ప్రతిపక్ష వైసీపీతో పాటు విపక్షపార్టీలు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించాలని, వారిని చైతన్యపరచాలని, ప్రతి జిల్లాలోనూ ధర్మపోరాట సభతో పాటు, సైకిల్ యాత్రలను చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. కాగా, తొలుత ఈ నెల 20వ తేదీన ధర్మపోరాట సభ నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల మార్పులు చోటుచేసుకున్నాయి.