సమయానికి సరైన చాయ్ పడకపోతే చాలామందికి బుర్ర పనిచేయదు. ఎన్ని టెన్షన్లలో ఉన్నా.. ఒక మాంచి అల్లం టీ తాగితే రిఫ్రెష్ అయిపోవచ్చు. ఓ స్ట్రాంగ్ ఇరానీ చాయ్ పడితే.. తలనొప్పి మాయమైపోతుంది. కానీ ఆఫీసు క్యాంటీన్లలో పౌడర్ టీలు తాగితాగి కడుపు ఖరాబ్ అయిపోతుంది. ఒక వేళ బయటకు వెళ్తే.. వేడి నీళ్లు తాగినట్లే ఉంటుంది. పైగా ఏ నీళ్లు వాడతారో, పాలల్లో ఏం కలుపుతున్నారో తెలీదు. భరించలేని అపరిశుభ్రత! ఈ అంశాలన్నీ పరిశీలించిన నితిన్ బియాని, పూజ జంట..ఏడాదికి రూ.30లక్షల జీతాలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేశారు. నాలుగు నెలలపాటు మార్కెట్ సర్వే చేసి..నాగపూర్‌లో ‘చాయ్ విల్లా’ను ప్రారంభించారు. ‘నేను, పూజ ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్లం. అపరిశుభ్రమైన టీలు తాగలేకపోయేవాళ్లం.
చిక్కని చాయ్ కోసం తహతహలాడే వాళ్లం. అందుకే అందరికీ రుచికరమైన, ఆరోగ్యకరమైన టీని అందించాలన్న లక్ష్యంతో గత నవంబరులో చాయ్ విల్లా మొదలుపెట్టాం’ అని నితిన్ తెలిపారు. ‘గత ఐదు నెలల్లో లక్షా 75 వేల కప్పుల టీ అమ్మాం. గల్లా పెట్టెలోకి రూ.15 లక్షల ఆదాయం వచ్చింది’ అని పూజ గర్వంగా చెబుతున్నారు. కప్పు టీకి రూ.8 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. తమ ఉద్యోగులు, అతిథుల కోసం రోజూ పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేసే కంపెనీలకు మంత్లీ సబ్‌స్ర్కిప్షన్ సదుపాయం కూడా ఉంది. 2019 నాటికి నాగపూర్‌లో మరో పది చాయ్ విల్లాలు ఏర్పాటుచేసి.. 20 లక్షల కప్పుల టీ అమ్మాలనీ, రూ.3 కోట్ల ఆదాయం సంపాదించాలని నితిన్-పూజ దంపతులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 150మందికి ఈ జంట ఉపాధి కూడా కల్పిస్తోంది