అలనాటి నటీమణి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌లో, సమంత జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ రోజు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చారు.

ఈ సందర్భంగా వేదికపై నాగార్జున మాట్లాడుతూ… “ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి పేర్లు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. వారు లేకపోతే మాయాబజార్‌ లాంటి ఎన్నో అద్భుత సినిమాలు ఉండేవి కావని అన్నారు. మూగ మనసులు, డాక్టర్‌ చక్రవర్తి, మిస్సమ్మ లాంటి ఎన్నో సినిమాలు తనకు చాలా ఇష్టమని అన్నారు. ఇంకో విషయమేంటంటే.. నాకు ఎనిమిది నెలల వయసులో సావిత్రి గారు నన్ను ఎత్తుకుని సినీ రంగానికి పరిచయం చేశారు.. ‘వెలుగు నీడలు’ సినిమాలో. దాంతో ఆమె స్టార్‌డమ్‌ నాకు కూడా కొద్దిగా వచ్చింది.

ఒక వ్యక్తిపై బయోపిక్‌ తీయాలంటే ఆ వ్యక్తికి ఓ అర్హత ఉండాలి, ఆ అర్హత సావిత్రిగారికి ఉంది. ఇది తెలుగు సినీచరిత్రలో మొదటి బయోపిక్. ఒక స్త్రీకే ఆ అర్హత దక్కింది.. అలాగే, ఈ సినిమాకు పనిచేసిన 20 మంది టెక్నిషియన్లు ఆడపిల్లలేనట.. ఆ వేదికను కూడా ఆడపిల్లలే వేశారట. తెలుగు సినీ పరిశ్రమలో ఆడపిల్లలకి అంతటి గౌరవం ఇస్తున్నాము” అని అన్నారు.

కాగా, ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘మహానటి’ మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య కనిపించనున్నాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments