సినీరంగంలో వారసులు ఎక్కువ అవుతున్నారు. వారి గుప్పెట్లోనే సినిమా. ప్రముఖ నటులు, దర్శకులకు వారుసులై ఉంటేనే ఈ రంగంలో కొనసాగగలం. అలా కాకుంటే పక్కన పెట్టేస్తారు అని నటి కాజల్‌అగర్వాల్‌ అన్నట్టుగా సోషల్‌మీడియాలో ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే దీని గురించి కాజల్‌ స్పందిస్తూ పుట్టుకతోనే ఎవరూ స్టార్‌ కాలేరని, సినిమా రంగంలో వారసులకు మొదట్లో అవకాశాలు అయితే రావచ్చుగానీ నిలదొక్కుకోవాలంటే ప్రతిభ చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

వారసుల్లోనూ చాలా మంది ఎంతో కృషి, శ్రమతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఉదాహరణకు నటుడు విజయ్, సూర్య, కార్తీ తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, నాగచైతన్య వంటి వారు వారసులుగా తెరంగేట్రం చేసినా ప్రతిభ, కఠిన శ్రమతోనే స్టార్స్‌గా ఎదిగారన్నారు. శ్రమను, కష్టాన్ని నమ్మే పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే వారసులనే ఇమేజ్‌ వారికి ఒక రకంగా భారం అని అన్నారు.

ప్రముఖ నటుల వారసులు కావడంతో వారిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ఇతరుల కంటే వారసులు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని అన్నారు. అలాంటిది వారసుల గురించి తాను ఎప్పుడూ తక్కువగా మాట్లాడలేదని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూస్‌లో నిజం లేదని కాజల్‌అగర్వాల్‌ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. నిజానికి కాజల్‌కు సక్సెస్‌ గ్రాఫ్‌ బాగానే ఉంది. అయినా క్రేజ్‌ తగ్గింది. కొత్త హీరోయిన్ల రాక ఎక్కువ అవడం ఒక కారణం కావచ్చు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్‌లో ప్యారిస్‌ ప్యారిస్‌ అనే ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు. టాలీవుడ్‌లోనూ స్టార్స్‌తో నటించే అవకాశాలు లేవు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments