ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమైన తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా తిరుపతిలో ‘ధర్మపోరాట’ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సభ ఇచ్చిన విజయంతో ఊపుమీదున్న టీడీపీ తర్వాతి సభను విశాఖలో నిర్వహించాలి నిర్ణయించింది. అంతిమ సభను మాత్రం అమరావతిలోనే నిర్వహించి కేంద్రం మెడలు వంచాలని నిర్ణయించింది.

తిరుపతి సభలో మోదీ ఇచ్చిన హామీలను ప్రస్తావించి, తెరపై ప్రదర్శించిన టీడీపీ.. మలిసభను ఎక్కడ నిర్వహించాలన్నదానిపై చర్చించింది. విశాఖపట్టణంలోనే అయితే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెలాఖరులో మహానాడు ఉండడం వల్ల అంతకంటే ముందే విశాఖలో అంటే మూడో వారంలోనే ధర్మ పోరాట సభ నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే అంతిమ సభను మాత్రం రాజధాని అమరావతిలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.

అమరావతి సభ నాటికి ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుందని, తేదీలు కూడా ఖరారవుతాయని, కాబట్టి భారీ నిర్వహించాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్యలో  సభను నిర్వహించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. అలాగే, అంతకంటే ముందు అన్ని జిల్లాలోనూ సభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది వరకే ప్రకటించారు.

కేంద్రంలోని అధికార బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా నేరుగా విమర్శలు చేస్తున్నది ఒక్క టీడీపీయేనని, తమ పోరాటానికి వ్యతిరేకంగా వైసీపీ వంచన దీక్ష చేయడాన్ని ప్రజలు గమనించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మహానాడును ఈసారి విజయవాడలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మహానాడుకు అనువైన మైదానం ఎంపిక కోసం నేడు జరిగే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments