గ్లాసు మజ్జిగ మహా అయితే ఎంత ఉంటుంది రూ.10 లేదా రూ.20 మరీ ఏ స్టార్‌ హోటల్లోనే అయితే ఓ వంద రూపాయలు ఉంటుంది. అంతే కానీ ఓ గ్లాసు మజ్జిగ కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టే వారిని ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. ఒక్క మజ్జిగనే కాదు ఐస్‌క్రీమ్‌, సోడా ఖరీదు కూడా దాదాపు ఇంతే. అయినా జనాలు ఎగబడి మరి కొన్నారు. ఏంటాబ్బ వాటి ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా…! ఇక్కడ మజ్జిగ, సోడా వీటికి పెద్ద ప్రత్యేకత ఏమి లేదు కాని​ వాటిని  అమ్మే వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకం. ఆయనే మెగా ‘పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌’.

రామ్‌ చరణ్‌ మజ్జిగ అమ్ముతున్నాడంటే అదేదో షూటింగ్‌ కోసం అనుకుంటే పొరబడినట్లే. ఓ 60 మం‍ది చిన్నారులను ఆదుకోవడానికి రామ్‌ చరణ్‌ ఇలా మజ్జిగ అమ్మే వ్యక్తిగా మారారు. ఇదంతా కూడా ఓ ప్రముఖ తెలుగు టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న లక్ష్మీ మంచు ‘మేము సైతం’ కార్యక్రమం కోసం. లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా నిస్సహాయులకు చేయుతనివ్వడం కోసం టాలీవుడ్‌ తారలు మేముసైతం అంటూ ముందుకు వస్తున్నారు.

ఆపన్నులను ఆదుకోవడం కోసం సామాన్యులుగా మారి ఓ రోజంతా కష్టపడి పని చేసి వారి కోసం డబ్బు సంపాదిస్తున్నారు. మేము సైతం మొదటి సీజన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్లో డా. మోహన్‌ బాబు, అలీ, రానా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు ఇంకా అనేక మంది తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ప్రసారమవుతున్న రెండో సీజన్లో ఇప్పటి వరకూ జయప్రద, నివేదా థామస్‌, కీర్తి సురేష్‌లు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి లిస్టులోకి రామ్‌ చరణ్‌ కూడా చేరారు. 60 మంది చిన్నారులకు ఆశ్రయం ఇస్తున్న ఓ శరణాలయాన్ని ఆదుకోవడానికి ‘చిట్టిబాబు’ ఇలా మజ్జిగ అమ్మే వ్యక్తి అవతారం ఎత్తారు. ఈ విషయం గురించి లక్ష్మీ మంచు ‘నా ప్రియ స్నేహితుడు రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు. 60మంది చిన్నారులను ఆదుకోవడానికి ‘మేము సైతం’ కార్యక్రమానికి వచ్చింనందుకు ధన్యవాదాలు. ఈ సీజన్లో ఇది బెస్ట్‌ ఎపిసోడ్‌ అవుతుంది. దీన్ని వీక్షించేందుకు ప్రేక్షకులతో పాటు నేను చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాం.’ అంటూ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments